అమెరికాలో భూకంపం.. ఐరాస సమావేశం మధ్యలో ఊగిన భవనాలు




తైవాన్‌‌లో చోటు చేసుకున్న భూకంపం నుంచి అంతర్జాతీయ సమాజం కోకముందే అమెరికాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు న్యూజెర్సీ, న్యూయార్క్‌‌లలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

న్యూజెర్సీలోని వైట్‌హౌస్ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్ధితిపై భద్రతా మండలిలో చర్చిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో సమావేశాన్ని నిలిపిశారు. 

ఇదిలావుండగా.. బుధవారం తైవాన్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుని వుండొచ్చని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. 

హువాలిన్ నగరానికి నైరుతి దిశగా 18 కిలోమీటర్ల దూరంలో, 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పరిశీలన సంస్థ గుర్తించింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత తైవాన్‌లో చోటు చేసుకున్న అతిపెద్ద భూకంపం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 




Comments